కలెక్టరేట్ లో మట్టి గణపతుల పంపిణీ*
*
నిజామాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 06 : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) లో శుక్రవారం సాయంత్రం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ఉద్యోగులకు మట్టి గణపతులు పంపిణీ చేశారు. వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ద్వారా కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తుండడం గొప్ప విషయమని ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. పర్యావరణ సమతుల్యత కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలోనూ ప్రభుత్వపరంగా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జల వనరులు కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు