బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి* -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
*
నిజామాబాద్ , సెప్టెంబర్ 11 (నిఘానేత్రం ప్రతినిధి )
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్ఎస్ఆర్ – 2025 లో భాగంగా బీ.ఎల్.ఓ లు ఇంటింటికి వెళ్లి బీఎల్ఓ యాప్ ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారణ చేసుకోవడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఇంటింటి సర్వేకు తోడ్పాటును అందిస్తూ ఓటరు జాబితా పక్కాగా రూపొందేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. అవసరం ఉన్న చోట పోలింగ్ కేంద్రాలను విభజించడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాంటి పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తే, వాటి వివరాలను తమ దృష్టికి తేవాలని సూచించారు. అక్టోబర్ 29న ఓటరు జాబితా డ్రాఫ్ట్ రోల్ ప్రకటించడం జరుగుతుందని, దానిని పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. ఈ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ బూత్ ల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అక్టోబర్ 29 నుండి నవంబర్ 18 వ తేదీ లోపు రెండు పర్యాయాలు పోలింగ్ బూత్ స్థాయిలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్రాఫ్ట్ రోల్ లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి సవరించడం జరుగుతుందన్నారు. కాగా, ఓటరు జాబితాలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖుల పేర్లు ఉన్నాయా, లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరుగా పేరు నమోదు చేసుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు చూడాలని కోరారు. అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.