Home

*ఆనాడు నెహ్రు నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సారధ్యంలో నిజాం పానాలకు విముక్తి* *ఈనాడు రాహుల్ గాంధీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో* *నయా నిజాం పాలనకు విముక్తి* * *తెలంగాణా ప్రజలకు ప్రజాపాలన రుచి చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం** *వరంగల్ లో జరిగిన ప్రజా పాలన దినోత్సవం లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి**

హైదరాబాద్ సెప్టెంబర్ 17: (నిఘానేత్రం ప్రతినిధి)

”ఇప్పటి తరాలకు, ఇప్పటి తెలంగాణ బిడ్డలకు నిజాం కానీ నియంత కానీ, ఎట్లా ఉంటాడో, నియంతృత్వం అంటే ఎలా ఉంటుందో, నియంతల పాలనంటే, గడీల పాలన అంటే ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి వాటిని ఆచరణాత్మకంగా చూపడానికి ఒక పెద్ద మనిషి ప్రయత్నం చేసారు. విజయవంతం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే ఆ పెద్ద మనిషి నయా నిజాం అయ్యాడు. నియంతలు ఎట్లా ఉంటారో ప్రజలకు పదేండ్లు చూపారు. ప్రజాస్వామ్యం పీక పిసికేసారు. తన తెలంగాణ అంటూనే ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, ఉద్యమాలను నిషేధించారు. కాదన్నవాడిని కాలికిందేసి తొక్కేసారు. ధరణి పేరుతో భూముల్నే కాదు, ప్రాజెక్టుల్నీ కూడా పన్నుకు మట్టి అంటకుండా మింగేసారు. అవన్నీ నేను మీకు వివరించాల్సిన పనిలేదు. నాకంటే ఎక్కువగా మీరే అనుభవించారు. మీరంతా నయా నిజాం, నయా రజాకార్ల బాధితులే.

ఆనాడు భారత ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉప-ప్రధాని, హోం మంత్రి శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ను పంపి నిజాం పాలన నుంచి విముక్తి కల్పిస్తే, ఇప్పటి నయా నిజంను ఇంటికి పంపడానికి ఈనాడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, ఇతర కాంగ్రెస్ నాయకులకు ఆ పని అప్పగించింది. వీరంతా వీరోచితంగా పోరాడితే .. డిసెంబరు 7, 2023న నయా నిజాం నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి… ప్రజాపాలన అంటే ఏమిటో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం’గా నిర్వహించాలని మా ప్రభుత్వం నిర్ణయించిదని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఈ ఉత్సవాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం.ఎందరో త్యాగధనుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఈ విజయం సాధించుకున్నాం. ఆ త్యాగధనులందరికీ ఘన నివాళులర్పిస్తున్నా.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి… భారత్-పాక్ విభజన జరిగిన తరువాత… దేశంలో అప్పటివరకు బ్రిటీష్ వారి సహకారంతో స్వతంత్రంగా వ్యవహరించిన చాలా సంస్థానాల్లో కొన్ని భారత దేశంలో, మరి కొన్ని పాకిస్థాన్ లో విలీనం అయ్యాయి. దేనిలో విలీనం కాకుండా రజాకార్ల అండతో స్వతంత్రంగా ఉండాలనుకున్నది నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం. తెలుగు వారు ఎక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం కూడా ఈ రాజ్యంలో ప్రధాన భాగంగా ఉండేది.రజాకార్లను నిషేధించాలని కోరుతూ అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సెప్టెంబరు 7న నిజాంకు అల్టిమేటం పంపారు. కానీ నిజాం దాన్ని ఖాతరు చేయలేదు. సెప్టెంబరు 13, 1948న అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించింది. దాని ధాటికి తట్టుకోలేక నిజాం లొంగిపోవడంతో సెప్టెంబరు 17, 1948న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది. ఈ పరిణామంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రాజాస్వామ్య పరిపాలన ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు గడిచినప్పటికీ గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించింది.

గత సంవత్సరం 2023 డిసెంబర్ 7వ తేదీన కోలువుతీరిన మన ప్రజా ప్రభుత్వం… తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తున్నది.

సవాలక్ష సమస్యలు…. అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల మనోభిష్టం మేరకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతోంది.

గడచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు… మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచేశాం.

పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం.

ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం. లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి… మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం.

కార్యాచరణలు ప్రకటించి సగర్వంగా, సమున్నతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టాలని ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నది.

ప్రజా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్ధిక క్రమశిక్షణ వల్ల గత తొమ్మిది నెలల కాలంలో చేపట్టిన తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముప్పుకు గురయ్యారు. దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారు. 31 మంది మృతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలవల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించగలిగాం. అలాగే ముందస్తు తీసుకున్న చర్యల వల్ల 2,454 మందిని రక్షించాం.

వరద ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రతిపాదికన బాధితులకు సహాయ సహకారాలు అందించాం. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలతో పాటు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించాం. వరద బాధిత కుటుంబాలకు 16,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి 10 వేల రూపాయల పరిహారాన్ని ఇస్తున్నాం. ఇండ్లు కూలిపోయిన, దెబ్బతిన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నాం.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సంబంధించి కొత్త నగర నిర్మాణమే కాదు ఉన్న నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ను ఏర్పాటు చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించిన పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించాం. దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలకు గురికాకుండా హైడ్రా పని చేస్తుంది. సర్కారు ఆస్తుల పరిరక్షణతోపాటు, విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత హైడ్రాకు పెట్టాం. హైడ్రా ప్రారంభించిననాటినుంచి చెరువులను ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటివరకు పలుప్రాంతాలలోని చెరువులు, పార్కులలో అక్రమంగా నిర్మించిన 262 అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఫలితంగా 112 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే, ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.ఎన్నికల సందర్భంలోనే చెప్పాం. మేం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాం. ఈ రోజు అక్షరాలా అది చేసి చూపిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పాలన సాగిస్తున్నాం. ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమానావకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో చేస్తున్నాం“ అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button