*సింగరేణి కార్మికులకు బోనస్* * *దసరాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండగ* * *కార్మిక కుటుంబాలకు అందనున్న రూ.796 కోట్లు* * *ఒక్కో కార్మికునికి రూ.1.90 లక్షలు* * *తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ రూ.5 వేలు అందజేత* * *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
హైదరాబాద్ సెప్టెంబర్ 20:(నిఘానేత్రం ప్రతినిధి) సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా దసరాకు ముందే బోనస్ ప్రకటించారు. గతేడాది సింగరేణి సంస్థ ఉత్పత్తి, గడించిన లాభాల ఆధారంగా బోనస్‌ను ప్రకటించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒక్కో కార్మికునికి రూ.1.90 లక్షలు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేలు చొప్పున బోనస్ ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు అగ్రభాగాన నిలిచారని, ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంతో గని కార్మికుల పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి కొనియాడారు. అనంతరం సింగరేణి లాభాలు, విస్తరణ.. బోనస్‌కు సంబంధించిన వివరాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విలేకరులకు వివరించారు. ష్ట్రానికే తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థ రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఇతర సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎగుమతి చేస్తోంది. సింగరేణి కార్మికుల శ్రమతో 2023-24 సంవత్సరంలో సంస్థకు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సంస్థ విస్తరణ, పెట్టుబడులకు రూ.2,289 కోట్లు కేటాయించగా మిగిలినవి రూ.2,412 కోట్లు. ఇందులో మూడో వంతు రూ.796 కోట్లను కార్మికులకు బోనస్‌గా ప్రకటిస్తున్నాం. సింగరేణిలో మొత్తం 41,387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకొక్కరికి బోనస్ కింద రూ.1.90 లక్షలు అందించనున్నాం. గతేడాది సింగరేణి కార్మిలకు అందిన బోనస్ రూ.1.70 లక్షలు మాత్రమే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒకొక్కరికి అదనంగా అందుతున్న మొత్తం రూ.20 వేలు.*
* కాంట్రాక్ట్ కార్మికులకూ….
సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సంస్థలో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. వారందరికీ తొలిసారిగా రూ.5 వేల బోనస్‌ను అందజేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దసరా పండగకు ముందే ఈ మొత్తాన్ని వారికి అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.
* విస్తరణే లక్ష్యంగా…
సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలను భవిష్యత్ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దాని ప్రకారం.. ** సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1000 మెగావాట్లకు విస్తరించడం, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, జైపూర్‌లోని ప్రస్తుత థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో మరో 1×800 మెగావాట్ల సామర్థ్యం కల మరో థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం, రామగుండంలో టీఎస్ జెన్ కో ఆధ్వర్యంలో మరో 1×800 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన (పిట్‌హెడ్) 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సంస్థ పరిధిలోని వీకే ఓపెన్ కాస్ట్, గోలేటీ, నైనీ ఓసీలను ప్రారంభిస్తామని, సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం నూతన రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణతో పాటు హైదరాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్‌సాగర్‌రావు, సింగరేణి ఎండీ బలరాం, కార్మిక సంఘా ల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.