*ఖైరతాబాద్ లోని ఇందిరా నగర్ కాలనీ లో ఏర్పాటుచేసిన ‘స్వచ్ఛత కి భాగీదారి’ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు*
హైదరాబాద్ సెప్టెంబర్ 27:(నిఘానేత్రం ప్రతినిధి) ఖైరతాబాద్ లోని ఇందిరా నగర్ కాలనీ లో ఏర్పాటుచేసిన ‘స్వచ్ఛత కి భాగీదారి’ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ముందుగా ఇందిరా నగర్ కాలనీ లో పర్యటించి కాలనీ స్థితిగతులను, పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.
మన ఇల్లు, మన బస్తి, మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం పరిశుభ్రంగా స్వచ్ఛతతో సురక్షితంగా ఉండాలని అన్నారు. మన హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయని, స్వచ్ఛ సురక్షిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు.
ప్లాస్టిక్ ను వినియోగించరాదని, పూర్తిగా నిషేధించినప్పుడే భవిష్యత్తు బాగుంటుందన్నారు. మన పని మనం చేసినప్పుడే ప్రభుత్వ మద్దతు లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛత పై పూర్తి అవగాహన ఉండాలన్నారు.
స్వయం సేవ పరిశుభ్రత సేవ ద్వారా చేయాలని, స్వచ్ఛత దేశ సేవలో ఒక భాగమన్నారు. సమాజాభివృద్ధికి స్వచ్ఛత కార్యక్రమం అవసరమని, శుభ్రం చేయాల్సిన, శుభ్రంగా ఉంచుకోవలసిన ఆవశ్యకత అందరిదని పేర్కొన్నారు.
స్వచ్ఛతపై ఒకరి నుండి ఒకరికి అవగాహన కలగాలని, అందరినీ జాగృతం చేయాలని కోరారు. ఇందిరా నగర్ కాలనీ స్వచ్ఛతతో సుందరంగా తీర్చిదిద్దితే కాలనీ ప్రజలు సురక్షితంగా ఉంటారని పేర్కొన్నారు. ఇందిరా కాలనీ ఇతర బస్తీలకు మార్గదర్శకం కావాలని, అందుకు అందరూ సహకరించాలని గవర్నర్ కోరారు.
గవర్నర్ గారికి ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ… రాజ్ భవన్ కు సెక్రటేరియట్ కు చాలా దగ్గరగా ఉన్న ఈ కాలనీని స్వచ్ఛతలో అభివృద్ధి సాధించేలా గవర్నర్ ఇందిరా నగర్ కాలనీ ని దత్తత చేసుకున్నారని తెలిపారు.
కాలనీ స్వచ్ఛతతో పాటు కాలనీలోని ప్రతి ఇంటిని అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గవర్నర్ కార్యాలయం నుండి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇందిరా నగర్ కాలనీలోని ఇంటింటికి వచ్చి ఏ సమస్యలు ఉన్నాయన్నది తెలుసుకుని, కుటుంబ స్థితిగతులపై వివరాలు సేకరించి, ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చో ఆ దిశగా, ప్రతి ఇంటిని అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారన్నారు. రానున్న ఆరు నెలల్లో కాలనీ రూపురేఖలు మారాలని, స్వచ్ఛతకు మరో పేరుగా ఉండాలన్నారు. ఆ దిశగా కాలనీవాసులు కృషి చేయాలని కోరారు.
అంతకుముందు గవర్నర్ అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. వాలంటీర్లు ఫ్లాష్ మాబ్ పర్ఫామెన్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయారెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాటా, జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, శానిటేషన్ సిబ్బంది, కాలనీ ప్రజలు, మహిళలు, ఎన్జీవోలు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.