*నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*
నిజామాబాద్, సెప్టెంబర్ 29 :(నిఘానేత్రం ప్రతినిధి) ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయిని అధిరోహించేలా హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని వసతులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ముప్కాల్ మండలం పోచంపాడ్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులతో కలిసి గురుకులంలోనే రాత్రి బస చేశారు. ఆదివారం వేకువజామున విద్యార్హుల రోల్-కాల్ ను పరిశీలించారు. విద్యార్థుల కోసం తెచ్చిన పాల నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ కోసం జాగింగ్, వామప్ చేపించిన తీరును పరిశీలించారు. ఖోఖో ఆడేందుకు సిద్ధమైన విద్యార్థులను కలెక్టర్ పరిచయం చేసుకుని, వారి ఆటను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులకు పలు సదుపాయాలు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటిని సమకూర్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నందున విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికారాన్ని అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ సురేందర్, ఉపాధ్యాయులు ఉన్నారు