Politics

*ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు* *వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి* *ఏ దశలోనూ అన్నదాతలు ఇబ్బంది పడకూడదు* *రైతులను మోసగించేందుకు ప్రయత్నించే వారిపై క్రిమినల్ కేసులు* *పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా సరిహద్దులలో గట్టి నిఘా* *సన్న రకం, దొడ్డు రకం ధాన్యాలకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు* *ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు* *సన్నాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి* *ఈ నెల 9న ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేత* *గడువు లోపు ధ్రువపత్రాల పరిశీలనను పూర్తి చేయాలని ఆదేశం*

నిజామాబాద్, అక్టోబర్ 03 :(నిఘానేత్రం ప్రతినిధి) ఖరీఫ్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ తదితరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ధాన్యం సేకరణ, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

ధాన్యం సేకరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, ఏ చిన్న పొరపాటుకు సైతం ఆస్కారం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీ.ఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 60.73 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ధాన్యం సాగు చేసినందున పెద్ద ఎత్తున దిగుబడులు చేతికందే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సుమారు 7 వేల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. అవసరమైన పక్షంలో మరిన్ని కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసారి దొడ్డు రకం, సన్న రకం ధాన్యాలకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300 చొప్పున కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు, సన్న రకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 500 చొప్పున బోనస్ అందించనుంది తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సన్న ధాన్యంలో దొడ్డు రకం వడ్లు కలువకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, వేర్వేరు కేంద్రాల ద్వారా వీటిని కొనుగోలు చేయాలని సూచించారు. అదనంగా బోనస్ అందిస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి కూడా సన్న ధాన్యం ఇక్కడికి తరలించి విక్రయించేందుకు పలువురు ప్రయత్నించే అవకాశాలు ఉన్నందున, పొరుగు ధాన్యం రాకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయంలో పోలీసు శాఖ జిల్లా యంత్రాంగంతో సమన్వయము ఏర్పర్చుకుని సమర్ధవంతంగా పని చేయాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి కోడ్ నెంబర్ కేటాయిస్తూ, ఏ రకం ధాన్యం మిల్లులకు పంపిస్తున్నారన్న వివరాలను ధాన్యం బస్తాలపై రాయాలని అన్నారు. దీనివల్ల రైసుమిల్లులకు కేటాయించిన ధాన్యం నిల్వల్లో ఏవైనా అవకతవకలు జరిగితే, అవి ఏ కొనుగోలు కేంద్రం ద్వారా కేటాయించబడ్డాయన్నది సులువుగా నిర్ధారణ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు నష్టం వాటిల్లకుండా, ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల వ్యవధిలో వారి ఖాతాలలో బిల్లులకు సంబంధించిన డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. ఎవరైనా రైతును మోసగించేందుకు, నష్టపర్చేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించవద్దని, అవసరమైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీ.ఎం స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు సరిపడా సంఖ్యలో సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకుని వెంటదివెంట ధాన్యం తూకం జరిగేలా, ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు రవాణా జరిగేలా చొరవ చూపాలన్నారు. ధాన్యం అమ్మకాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు తెలియజేసేందుకు వీలుగా జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ తో కూడిన కంట్రోల్ రూమ్ ను నెలకొల్పాలని ఆదేశించారు. రైతుల నుండి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్లకు సూచించారు. ఏ ఒక్క కొనుగోలు కేంద్రం కూడా అర్ధాంతరంగా మూతబడకుండా, రైతుల నుండి చివరి ధాన్యం గింజను సైతం కొనుగోలు చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని హితవు పలికారు. పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు సరిపడా గిడ్డంగులు, స్టోరేజ్ పాయింట్లను గుర్తించాలని సూచించారు.

వచ్చే జనవరి మాసం నుండి రాష్ట్ర ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందించనున్న దృష్ట్యా, రైతులు సన్న రకాలకు చెందిన వరి ధాన్యం పండించేలా ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం సన్న ధాన్యం సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు.

కాగా, రాష్ట్రంలో డీఎస్సీ-2024 ద్వారా 11062 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో, విజయదశమి పండుగకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. డీఎస్సీ ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ప్రకారం 1 : 3 నిష్పత్తిలో చేపడుతున్న సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 5 వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. 25231 మంది అభ్యర్థులకు గాను గురువారం మధ్యాహ్నం నాటికి 9090 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ పూర్తయ్యిందని, మిగతా అభ్యర్థులకు సంబంధించిన పరిశీలన ప్రక్రియను కూడా గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 9న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం రమేష్, డీసీఓ శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ అధికారి గంగూబాయి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button