*జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రక్కదారిపై విచారణ పూర్తి* *దోషులపై చర్యలు.. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ*
ఖమ్మం, అక్టోబర్ – 09:(నిఘానేత్రం విలేకరి)జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రక్కదారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్. పి. శ్రీజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గత రబీ, ఖరీఫ్ కు సంబంధించి రైతుల నుండి ధాన్య సేకరణ చేసిన పిదప ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, కస్టమ్ మిల్లింగ్ రైస్ ను తిరిగి ఇచ్చుటకు గాను జిల్లాలోని రైస్ మిల్లులకు వాటి వాటి సామర్థ్యం మేరకు ధాన్యం కేటాయింపులు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ తెలిపారు. ఇట్టి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి ప్రజావసరాల నిమిత్తం బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత మిల్లర్లపై ఉందని అదనపు కలెక్టర్ అన్నారు. క్షేత్ర స్థాయిలో ఏ మిల్లర్ వద్ద ఎంత ధాన్యం ఉంది, కస్టమ్ మిల్లింగ్ రైస్ కి ఎంత ధాన్యం ఇచ్చారు, ఇంకా ఎంత రావాల్సి ఉంది వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖ అధికారులపై వుందని అదనపు కలెక్టర్ తెలిపారు.గత నెల 24న చేపట్టిన తనిఖీల్లో కొన్ని మిల్లుల్లో కేటాయించిన ధాన్యం నిల్వలు లేనట్లుగా గుర్తించి, ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టడం జరిగిందని అదనపు కలెక్టర్ తెలిపారు. మిల్లులకు సంబంధించి సిఎంఆర్ రైస్ అందజేత, ధాన్యం నిల్వలపై పౌరసరఫరాల సంస్థ విచారణ జరపగా, అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టడం జరిగిందన్నారు. విచారణ పూర్తిచేసి విచారణ నివేదిక జిల్లా కలెక్టర్ కు సమర్పించడం జరిగిందని అదనపు కలెక్టర్ అన్నారు.
చట్ట ప్రకారం బాధ్యులపై త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు అదనపు కలెక్టర్ అన్నారు. సిఎంఆర్ ప్రక్కదారి పట్టించిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం, విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపర చర్యలు చేపట్టనున్నట్లు అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.