*కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు* *గౌరీమాతకు పూజలు నిర్వహించిన కలెక్టర్*
నిజామాబాద్, అక్టోబర్ 09 :(నిఘానేత్రం ప్రతినిధి) బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని గౌరీమాతకు, రంగురంగుల పూలతో ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేసిన బతుకమ్మలకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ, పూల పండుగ ప్రాధాన్యతను చాటాయి. బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ మహిళా ఉద్యోగులు యువతులు, మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయ పనివేళలు ముగిసినప్పటికీ ఉద్యోగినులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఎంతో హుషారుగా ఈ ఉత్సవంలో పాల్గొని బతుకమ్మ వేడుక ఔన్నత్యాన్ని చాటారు.
ఈ ఉత్సవాల్లో డీఆర్డీఓ సాయాగౌడ్, టీజీఓల సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.