Politics

*ప్రజాభిప్రాయం మేరకే రిజర్వేషన్ల ఖరారుకు ప్రతిపాదనలు* *తెలంగాణ బీ.సీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ వెల్లడి* *నిజామాబాద్ లో బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ* *పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం*

నిజామాబాద్ ప్రతినిధి:(నిఘానేత్రం ప్రతినిధి) ప్రజలు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక స్థితిగతుల విశ్లేషణ కోసం ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా వెల్లడయ్యే అంశాలను పరిగణలోకి తీసుకుని స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల దామాషాపై తెలంగాణ బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలతో కూడిన నివేదికను సమర్పిస్తుందని కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ తెలిపారు. ఈ నివేదిక పూర్తిగా శాస్త్రీయ పద్దతిలో ఉండేవిధంగా కమిషన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజల నుండి అభ్యర్థనలు స్వీకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ నేతృత్వంలోని సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బాలలక్ష్మిలతో కూడిన బృందం మంగళవారం నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజామాబాద్, కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లాకు సంబంధించి బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. బీసీ సంఘాల నాయకులు, వివిధ వర్గాల వారు హాజరై రాతపూర్వకంగా విజ్ఞాపనలు కమిషన్ కు అందిస్తూ, మౌఖికంగా కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. బహిరంగ విచారణ ప్రక్రియకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నిర్దేశిత నమూనాలో అఫిడవిట్ తో కూడిన వినతులు కమిషన్ కు సమర్పించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కమిషన్ విధివిధానాల గురించి చైర్మన్ జి.నిరంజన్ క్లుప్తంగా వివరించారు. స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం పూర్తయ్యి ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుండి వచ్చే నిధులు నిలిచిపోయాయని అన్నారు. దీంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతోందని, ఇందులో భాగంగా స్థానిక సంస్థలలో ఆయా వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై అధ్యయనం కోసం బీ.సీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహిస్తోందని తెలిపారు. నవంబర్ మొదటి వారం నుండి రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా అన్ని వర్గాల ప్రజల ఆర్ధిక, సామాజిక స్థితిగతులు వెల్లడి కానున్నాయని, రిజర్వేషన్ల ఖరారుకు సర్వే అంశాలు దోహదపడతాయని ఆశాభావం వెలిబుచ్చారు. బీహార్ రాష్ట్రంలో 62 శాతం బీసీల జనాభా ఉందని, దీని ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని అక్కడి ప్రభుత్వం భావించగా, ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరణ తెలిపిందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో సైతం సర్వే నిర్వహించినప్పటికీ గత దశాబ్ద కాలంగా నివేదికను వెల్లడించని పరిస్థితి నెలకొని ఉందన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా శాస్త్రీయ పద్దతిలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రతిపాదనలు రూపొందించాలని కమిషన్ గట్టి కసరత్తులు చేస్తోందని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సర్వేను పూర్తి చేస్తామని, ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లకు సహకరిస్తూ పూర్తి సమాచారంతో కూడిన వివరాలను నమోదు చేయించాలని, ఈ దిశగా ప్రజలను చైతన్యపరచాలని కుల సంఘాల ప్రతినిధులను చైర్మన్ కోరారు. నవంబర్ 13 వ తేదీ వరకు సర్వే పూర్తవుతుందని, అనంతరం ఆన్ లైన్ లో డేటాను నిక్షిప్తం చేసి డిసెంబర్ 09 లోగా ప్రభుత్వానికి, రాష్ట్ర హైకోర్టుకు నివేదిక అందజేస్తామని తెలిపారు. బహిరంగ విచారణ సందర్భంగా ముఖ్యంగా విద్య, సామజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణపై ప్రజలు తమ స్థితిగతులను వెల్లడిస్తూ, రిజర్వేషన్లు కోరుతున్నారని అన్నారు. కాగా, బహిరంగ విచారణలో నేరుగా కలువలేకపోయిన కుల సంఘాలు, ప్రజలు ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే వచ్చే నెల నవంబర్ 13 వ తేదీ, సాయంత్రం 5.00 గంటల లోగా హైదరాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయం, ఖైరతాబాద్, జలమండలి, 4 వ అంతస్తులో నేరుగా కానీ, పోస్టు ద్వారా కూడా అభ్యర్థనలు పంపవచ్చని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, తెలంగాణ బీసీ కమిషన్ కు విజ్ఞాపనలు సమర్పించేందుకు బహిరంగ విచారణకు హాజరయ్యే వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, నిర్దేశిత నమూనాలో వినతులు అందించేలా సహకరించేందుకు హెల్ప్ డెస్క్ లు అందుబాటులో ఉంచామని అన్నారు. సామాజిక, ఆర్ధిక విశ్లేషణకై సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ఎన్యూమరేటర్లను, సూపర్వైజర్లను గుర్తించడం జరిగిందని, మాస్టర్ ట్రైనర్లచే వారికి సర్వే అంశాలపై శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క కుటుంబం సైతం మినహాయించబడకుండా ప్రతి ఒక్కరి సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాలను సమగ్రంగా సేకరించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు.

కాగా, బహిరంగ విచారణ కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న కమిషన్ బృందానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు, వివిధ సంఘాల ప్రతినిధులు కమిషన్ కు తమ అభిప్రాయాలను తెలియజేశారు. కమిషన్ బహిరంగ విచారణ ప్రక్రియలో స్పెషల్ ఆఫీసర్ సతీష్, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button