*వ్యవసాయ రంగంలో నూతన ధోరణులు , లాభదాయక వ్యవసాయంపై అవగాహన కలిగించాలి* *రైతు పండుగ ద్వారా కొత్త పంటలు, యాంత్రికీకరణ పై రైతులకు అవగాహన- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు* *ఆయిల్ పామ్ తోటలు పెంచండి ,భరోసాగా ప్రభుత్వం ఉంటుంది*
మహబూబ్ నగర్.నవంబర్28(నిఘానేత్రం ప్రతినిధి)రానున్న నాలుగు సంవత్సరాలలో రైతుల కోసం ప్రభుత్వం అనుకున్న పనులన్నీ చేసి రైతులతో సెహబాస్ అనిపించుకుంటుంటుందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు
గురువారం ఆయన మహబూబ్నగర్ జిల్లా, అమిస్తాపూర్ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన రైతు పండుగ వ్యవసాయ ప్రదర్శనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ,రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లతో కలిసి ప్రారంభించారు .
ఈ రైతు పండుగ వ్యవసాయ ప్రదర్శనలో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఆహార పదార్థాల ప్రదర్శన పై 117 స్టాళ్లు, ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం తోపాటు, సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా వ్యవసాయ మెలకువలను అందించడానికి మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన రైతు పండుగ వ్యవసాయ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ రంగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి లాంటి మేధావులు రైతులకు లాభసాటి వ్యవసాయం ఏ విధంగా చేయాలో ఈ సదస్సులో అవగాహన కల్పిస్తారని అన్నారు. చింతల వెంకట్ రెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏ పంట వేసినా అత్యధిక దిగుబడి తీయడంలో చింతల వెంకట్ రెడ్డి ఆదర్శంగా ఉంటారని కొనియాడారు. ఇతర దేశాల్లో ఎలాంటి పంటలు పండించి లాభం పొందుతున్నారు, కొత్త పంటల పై రైతులకు మూడు రోజుల సదస్సులో అవగాహన కల్పిస్తారని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదృష్టం కొద్దీ పాలమూరు జిల్లా ముద్దు బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని, ఈ జిల్లాను వలసల జిల్లా కాకుండా వలసలు వచ్చే జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలియజేశారు. రాబోయే 4 సంవత్సరాల్లో ప్రభుత్వం రూపొందిస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు.
అత్యంత లాభదాయకమైన పంట పామాయిల్ అని, దీనిని జంతువులు , చీడ పురుగులు నష్టం చేయవని, అందువల్ల పామాయిల్ పంటను రాష్ట్రవ్యాప్తంగా రైతులు సాగు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ 117 స్టాళ్ళతో ఏర్పాటుచేసిన ఇంత గొప్ప రైతు సదస్సు ను ఇప్పటి వరకు తాను చూడలేదని అన్నారు.
2003-2004 ప్రాంతంలో వ్యవసాయం దండగ అని ప్రచారం జరిగితే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించి కొంతవరకు పూర్తి చేయడం వల్ల వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించారన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసినా ప్రస్తుత ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం సాహసోపేత నిర్ణయం తీసుకుంటూ వాటిని సాకారం చేసుకుంటూ ముదుకు పోతుందన్నారు. వ్యవస్థ అనేది శాశ్వతమని పాలించే నాయకుల నిర్ణయాల్లో దార్శనికత, అంకిత భావం ఉండాలని ఆలాంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా చేయాలి, ఆధునిక పద్ధతులు, ఆధునిక వంగడాలపై సాంకేతికతను మేధావుల చేత రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన రైతు పండుగలాగ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 70 వేల కోట్లు కంటే తక్కువ రుణభారం ఉండేదని,గడచిన పది సంవత్సరాల కాలంలో ఏకంగా 8 లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వం అప్పజెప్పిందని గత ప్రభుత్వం చేసిన అప్పులకు గడచిన పది నెలల్లో సుమారు 60000 కోట్లు వడ్డీ కిందనే చెల్లించడం జరిగింది అన్నారు. ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం వచ్చాక రైతు రుణ మాఫీ చేసిందని తెలిపారు.ఇటీవల 18 వేల కోట్లతో రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయడం జరిగిందన్నారు. సన్న రకం వరి ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు, క్వింటాలుకు 500 రూపాయల అదనంగా బోనస్ చెల్లించడం జరుగుతున్నదని, ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని తెలియజేశారు. రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయని, ఇందుకు సంబంధించి ప్రదర్శనలో స్టాళ్లు అనేకం ఏర్పాటు చేయడం జరిగిందని ,రైతులు వాటిని సందర్శించి స్ఫూర్తిని పొందాలని తెలియజేశారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ 2004 కంటే ముందు పాలమూరు జిల్లాలో పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేదని, 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలమూరు జిల్లాలో బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిలసాగర్ వంటి నీటి పారుదల ప్రాజెక్టులను ప్రారంభించి కొంతవరకు పూర్తిచేయడం వల్ల జిల్లాలో సాగునీరు వచ్చిందన్నారు. దానిని కొనసాగించి ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయడం తో పాటు, పాలమూరు రంగారెడ్డి ఫేజ్- 2 ప్రారంభించి, కాలువలు అన్ని పూర్తి చేస్తే మరో 10 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జూరాల ప్రాజెక్టు పూడిక తో నిండిపోయిందని దానివల్ల ప్రస్తుతము 6 నుంచి 7 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంటుందన్నారు. జూరాల పూడిక తీయాలని గత ప్రభుత్వానికి విన్నవిస్తే పేద చెవిన పెట్టిందని, ప్రస్తుత ప్రభుత్వము త్వరలోనే జూరాలలో పూడిక తీసే కార్యక్రమం చేపడుతుందన్నారు దానివల్ల16 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు.
సాగు నీరు పుష్కలంగా ఉంటే ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. పాలమూరు జిల్లాలో ఇతర రాష్ట్రాల నుండి పాలు దిగుమతి చేసుకోవడం, కూరగాయలు తేప్పించుకోవడం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితి మారి ఇక్కడే కూరగాయలు పండించి ఇతర జిల్లాలకు పంపించే విధంగా, అదేవిధంగా జిల్లాలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని సూచించారు.
రాష్ట్ర వ్యవసాయ కమిషన్ అధ్యక్షుడు కోదండ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ఇంకా నెలన్నర రోజుల ముందే మహబూబ్నగర్ జిల్లాలో రైతు ను రాజు చేయడానికి వ్యవసాయ పండుగ జరుపుకోవడం జరుగుతున్నదని అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వము వచ్చాక రైతును అన్నదాత అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయంపై మమకారం ఉందని, అందుకే రైతులకు అండగా ఉండే అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ధరణి కమిటీ వేయడం,ఆర్వో ఎఫ్. ఆర్ చట్టం తేవడం, ధరణి సాఫ్ట్ వెర్ నియంత్రణ ను వేరే దేశం నుండి తీసుకొని ఎన్. ఐ.సి సంస్థకు ఇవ్వడం జరిగిందన్నారు. అందువల్ల రైతులు ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు.
రైతు పండగ కార్యక్రమ సభాధ్యక్షులు , దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు రైతులకు సేంద్రియ, ఆధునిక వ్యవసాయంపై ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ సంవత్సర కాలంలో 52 వేల కోట్లు రైతులకు వివిధ పథకాల కింద ఖర్చు చేయడం జరిగిందన్నారు. స్వయంగా రైతు బిడ్డ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రైతుకు ఏ విధంగా అండగా ఉండి సహాయ సహకారాలు చేయాలో ప్రణాళికలు రూపొందిస్తున్నారని, 30 న ముఖ్యమంత్రి విచ్చేసి రైతులకు సంతోషకరమైన ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి రైతులు భారీగా తరలి రావాలని కోరారు.
మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందన్నారు. మార్కెట్లో సన్న రకానికి 3000 ధర పలుకుతుందని తెలిపారు. కొత్త ఆవిష్కరణలతో రైతులకు అవగాహన కల్పించి రైతును రాజు చేయాలని ప్రభుత్వం రైతు సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్వాగతోపన్యాసం
చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న రైతు పండుగలో రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ , రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి సెరికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాష ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, జిల్లా ఎస్పీ జానకి, డిసిసి బ్యాంక్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ,
మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ,వనపర్తి శాసనసభ్యులు మేఘా రెడ్డి , షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్
వ్యవసాయ ,అనుబంధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు