*జనవరి 26 నుంచి నాలుగు సంక్షేమ కార్యక్రమాల అమలు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో నిర్మించిన గృహ సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి*
ఖమ్మం, జనవరి -11: (నిఘా నేత్రం ప్రతినిధి)జనవరి 26 నుంచి పేద ప్రజల కోసం నూతనంగా నాలుగు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
శనివారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో నిర్మించిన 80 ఇళ్ల గృహ సముదాయాన్ని ప్రారంభించి, ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అప్పగించారు.
ఈ సందర్భంగా *మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,* సంక్రాంతి కానుకగా పేదలకు 80 డబుల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తున్నామని అన్నారు. సంవత్సరం క్రితం ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, గత 10 సంవత్సరాల సమయంలో జరిగిన అవకతవకలను సరి చేసేందుకు సంవత్సర సమయం పట్టిందని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అని, రాబోయే రోజులలో వేల సంఖ్యలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు.
గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చడంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో రైతు భరోసా, నూతన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, రైతుకూలీ లకు ఆర్థిక సహాయం వంటి పథకాలపై చర్చించామని, అర్హులకు జనవరి 26 నుంచి ఈ పథకాలు అమలు అవుతాయని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు అందుతాయని, వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 12 వేల రైతు భరోసా అందిస్తామని, భూమిలేని నిరు పేద కుటుంబాలకు సంవత్సరానికి 12 వేల రూపాయలను రెండు విడతలుగా అందిస్తామని అన్నారు.
జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, మొదటి విడతలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు 3500 ఇండ్లు అందిస్తున్నామని, లబ్ధిదారుల సర్వే 90 శాతం పూర్తయిందని, గ్రామ కమిటీలు, గ్రామ సభలు పెట్టి అందరి సమక్షంలో అర్హులను ఎంపిక చేసి వారికి ఇండ్లు ఇస్తామని అన్నారు. రాబోయే రోజులలో రోడ్డు, పార్క్ నిర్మాణ పనులు ప్రారంభమవు తాయని, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటానని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,* ఇండ్ల కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు నేడు శుభ దినమని అన్నారు. భూమి లేని నిరుపేదలకు సంక్రాంతి లోపు ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో గత నాలుగు నెలలుగా మంత్రి తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల నేడు ఇండ్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
ఇప్పుడున్న ఇండ్లకు రోడ్డు కోసం కూడా మంత్రి రెండు కోట్లు మంజూరు చేశారని, అదే విధంగా ప్రజల కోరిక మేరకు జనవరి 20 లోపు ఇక్కడ అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజల అవసర పనులను మంత్రి వెంటపడి అధికారులతో చేయిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
మెప్మా ద్వారా మహిళలకు స్వయం ఉపాధి యూనిట్లు కూడా త్వరలో మంజూరు అవుతాయని అన్నారు. కుల, మతాలకు అతీతంగా పేదలకు ఇండ్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
కార్యక్రమంలో *ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ,* కాలనీలో నివసిస్తున్న ప్రజల కోసం డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడి వరకు 2 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు చివరి దశకు చేరాయని, వచ్చేవారం పనులు ప్రారంభమవుతాయని అన్నారు. కాలనీ మధ్యలో అందుబాటులో ఉన్న ఎకరం స్థలంలో 50 లక్షలతో పిల్లల కోసం ప్రత్యేక పార్క్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రవికుమార్, , సంబంధిత అధికారులు, 60వ డివిజన్ కార్పొరేటర్ బద్దె నిరంజన్ కుమార్, 59వ డివిజన్ కార్పొరేటర్ పట్టపోతుల లలిత రాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.