ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ వేడుకలు*
-శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
-అవాంఛనీయ ఘటనలు తావులేకుండా గట్టి బందోబస్తు : సీ.పీ కల్మేశ్వర్
-మంటపాల వద్ద సీ.సీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు హితవు
నిజామాబాద్ , సెప్టెంబర్ 04 (నిఘానేత్రం ప్రతినిధి )
ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం జరిపి కీలక సూచనలు చేశారు. మిలాద్-ఉన్-నబీ, గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో మతసామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటును అందిస్తామని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎంతో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ వేడుక ఒకేసారి వస్తున్నందున భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరకు కూడా విద్యుదాఘాతం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మండపాలకు ప్రభుత్వం తరపున ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నందున, మంటపాల వివరాలను ట్రాన్స్ కో అధికారులకు తెలియజేసి, ఆ శాఖ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. షార్ట్ సర్క్యూట్ వంటి వాటిని నిరోధించే ఉపకరణాలను అమర్చుకోవాలని హితవు పలికారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా వినాయక మంటపాలు ప్రతిష్టించాలని సూచించారు. భారీ శబ్దాల వల్ల చిన్నారులు, వృద్దులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున మంటపాల వద్ద శబ్ద కాలుష్యం కలిగేలా డీ.జే సౌండ్లతో హోరెత్తించకుండా భక్తి పాటలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు.
వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రక్రియను ఆద్యంతం అధికారులు పర్యవేక్షణ జరపాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రేన్, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, తాగునీరు, బారికేడింగ్, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పారిశుధ్యం వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో శోభాయాత్రలో పాల్గొనే వాహనాల్లో ఎటువంటి యాంత్రిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, నిమజ్జన యాత్ర కొనసాగే ప్రాంతాలలో రోడ్లకు ఇరువైపులా కిందికి వేలాడే కరెంటు తీగలు, వంగి ఉన్న చెట్ల కొమ్మలు వంటివి ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించాలని, ప్యాచ్ వర్క్ చేపట్టి రోడ్లపై ఏర్పడిన గుంతలను మూసివేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువులు, గోదావరి పరీవాహక ప్రాంతాల వద్ద సరిపడా సంఖ్యలో క్రేన్ లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు, జెండా బాలాజీ వేడుకల సందర్భంగా నిర్ణీత రోజుల్లో మద్యం విక్రయాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలు, వదంతులను నమ్మకూడదని, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తేవాలని, ప్రతి ఒక్కరు సంయమనం పాటిస్తూ పరస్పరం సహకరించుకుంటూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సి.సి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని, ఒక్క నిజామాబాద్ నగరంలోనే ఈసారి సుమారు 750 పైచిలుకు సీ.సీ కెమెరాలు నెలకొల్పుతున్నామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. అయితే నిర్వాహకులు కూడా గణేష్ మండపాల వద్ద ఎవరివారు కనీసం ఒకటైన సీ.సీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు. మంటపాల వద్ద నిర్వాహకులు రాత్రి వేళల్లో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టింగ్ లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, ప్రశాంతతకు భంగం కలిగిస్తూ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో శోభాయమానంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని, వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రతి మండపం వద్ద పోలీసులను నియమిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్, అదనపు డీసీపీలు కోటేశ్వర్ రావు, బస్వారెడ్డి, ఆర్దీఓలు అంబదాస్ రాజేశ్వర్, రాజాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.