*న్యాయవాదిపై భౌతిక దాడిని ఖండించిన జిల్లా బార్ అసోసియేషన్* *నవాతే జగన్ మోహన్ న్యాయవాదిగా అనర్హుడు*
నిజామాబాద్, సెప్టెంబర్ 12( నిఘానేత్రం ప్రతినిధి )
నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది వసంత్ రావు పై భౌతిక దాడి చేసిన జగన్ మోహన్ నవాతే తీరును బార్ అత్యవసర సమావేశంలో పలువురు సీనియర్ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు.బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, శ్రీహరి ఆచార్య, పిట్లం శ్రీనివాస్, పరుచూరి శ్రీధర్, కృపాకర్ రెడ్డి తదితరులు మాట్లాడుతు జిల్లాకోర్టు ప్రాంగణంలో న్యాయవాదిపై దాడిని న్యాయవాదులపై దాడిగా వారు అభివర్ణించారు. జగన్ మోహన్ నవాతే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉత్తర్వులు ఉన్నాయని వారు తెలిపారు. అలాంటి వ్యక్తి కోర్టు పరిధిలో ఉండి చట్ట విరుద్ధంగా వ్యవహరించడం చాలా పెద్ద తప్పిదంగా వారు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ నవాతే వ్యవహార శైలిని బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. అనంతరం బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ జరిగిన సంఘటనపై ముగ్గురు సీనియర్ న్యాయవాదులతో ఒక కమిటీని నియమించామని,వారు నివేదికను సమర్పించగానే జగన్మోహన్ నవాతే పై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు పిర్యాదు చేస్తామని తెలిపారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యత్వం నుండి సస్పెన్షన్ చేస్తు తదుపరి క్రమ శిక్షణ చర్యల కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. గత ఫిబ్రవరి నెల నుండి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా జగన్మోహన్ నవాతే పై ఉత్తర్వులు ఉన్నాయని వీటిని కక్షిదారులు గమనించాలని కోరారు.అతను కోర్టు ఆవరణలో బాధ్యతాయుతమైన బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు పై దాడి చేసి గాయపర్చడం, కులం పేరుతో దూషించడం,అవమానించడం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలకు సన్నద్ధం అవుతున్నట్లు జగన్ మోహన్ గౌడ్ తెలిపారు.