*జిల్లాలో ఏసీబీ కి చిక్కిన మరో అవినీతి జలగ*
* నిజామాబాద్ ,సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి )
నిజామాబాద్ జిల్లాలో అవినీతి పరుల ఆటలు సాగనివ్వకుండా ఏసీబీ అధికారులు మరో అవినీతి చేపను పట్టుకున్నారు. నందిపేట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. నందిపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న నవీన్ కంఠం గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. నందిపేట మండలం కంఠం గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి తన ఇంటి వివరాల ఆన్ లైన్ కోసం సెక్రటరీ నవీన్ లంచం కోసం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు.గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సుభాష్ సెక్రటరీ నవీన్ కు లంచం డబ్బులు ఇస్తుండగా డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవల నిజామాబాద్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి నరేందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేసి దాదాపు మూడు కోట్ల విలువైన నగదును, బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకే కోటగల్లి లోని సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ పై కూడా ఏసీబీ అధికారులు దాడి జరిపి సోదాలు నిర్వహించారు. తాజాగా నందిపేట్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన అవినీతి అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది.