*ప్రజా పాలన దినోత్సవ వేడుకకు ముస్తాబైన కలెక్టరేట్*
నిజామాబాద్, సెప్టెంబర్ 16 :(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవ వేడుకకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ముస్తాబైంది. మంగళవారం నిర్వహించనున్న ఈ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 10.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు ప్రజాపాలన దినోత్సవ తుది ఏర్పాట్లను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేదిక, ఆహూతులకు సిటింగ్ ఏర్పాట్లు, తదితర వాటి గురించి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ కిషన్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, పర్యవేక్షకుడు పవన్ తదితరులు ఉన్నారు.