వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి దోహదపడాలి* *అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్* *ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి*
నిజామాబాద్, సెప్టెంబర్ 17 :(నిఘానేత్రం ప్రతినిధి) జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల వృత్తి నైపుణ్యం పెంపొందించడం తోపాటు, వారికి ఉపాధి కల్పించి ఆర్థిక చేయూత అందించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత దేశ పారిశ్రామిక రంగ ప్రగతికి తార్కాణం విశ్వకర్మ అని కొనియాడారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం శ్రీ విరాట్ విశ్వ కర్మ వేడుకలను అధికారికంగా నిర్వహిసస్తోందని అన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం శ్రీ విరాట్ విశ్వకర్మ పథకాన్ని దేశ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. అర్హులైన అన్ని కులవృత్తులు, చేతి వృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని సూచించారు. ఈ పథకం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు, వారి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి ఆర్థిక పరిపుష్టి సాధించేలా చేయూత అందించడం జరుగుతుందన్నారు. కాగా, ప్రభుత్వం విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం ఎంతో హర్షణీయం అని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ
శాఖల అధికారులు, ఉద్యోగులు, ఆయా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.