Politics

*కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాహక సమావేశం* *అధికారులకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ దిశానిర్దేశం*

*

 

నిజామాబాద్, సెప్టెంబర్ 21 :(నిఘానేత్రం ప్రతినిధి) ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ శనివారం సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే నెల అక్టోబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తేనున్న నేపథ్యంలో, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్ సీజన్ లో సుమారు 4.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని, 11.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేతికందుతుందని అంచనా వేశామన్నారు. ఇందులో సన్న రకం ధాన్యం అత్యధికంగా 85 శాతం ఉందన్నారు. రైతులు తమ సొంత అవసరాల కోసం, ఇతర ప్రైవేట్ వ్యాపారులకు విక్రయాలు జరిపే ధాన్యాన్ని మినహాయిస్తే, ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని తరలించే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నామని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 480 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ధాన్యం దిగుబడులు చేతికందే సమయానికి కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం ‘ఏ’ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300 ధర చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ధాన్యం రవాణాకు సరిపడా సంఖ్యలో వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటదివెంట జరిగేలా అవసరమైన సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, బాగా ఆరబెట్టిన, శుభ్రపర్చిన ధాన్యం మిల్లులకు పంపాలని అన్నారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఏ చిన్న ఇబ్బందికి సైతం తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు.

ఈ సమావేశంలో డీఆర్డీఓ సాయాగౌడ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీ.ఎం రమేష్, డీసీఓ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిణి గంగూబాయి, డీపీఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button