ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు*
నిజామాబాద్, సెప్టెంబర్ 27 :(నిఘానేత్రం ప్రతినిధి) తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బీ.సి, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు వినాయకనగర్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గళమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని గుర్తు చేశారు. ఆ మహనీయుడి గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుందని, తెలంగాణ సమాజంలో జన్మించిన ఆణిముత్యం కొండా లక్ష్మణ్ బాపూజీ అని అభివర్ణించారు. ఆయన త్యాగాలు, పోరాట పటిమను నేటి తరానికి తెలియజేసేలా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు అందరూ పాటుపడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్, సహాయ అభివృద్ధి అధికారి నర్సయ్య, పద్మశాలి, బీసీ కుల సంఘాల నాయకులు పులగం హనుమాండ్లు, బిజ్జు దత్తాద్రి, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకట నర్సయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మురళి, పద్మశాలి ఆత్మీయ సమితి అధ్యక్షుడు గురుచరణం, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రభాగ, పి.నర్సయ్య, సామాజిక కార్యకర్త బంగారు సాయిలు తదితరులు పాల్గొన్నారు.