Politics

*అక్రమ మద్యం, గంజాయి రవాణా, కల్తీ కల్లుపై ఉక్కుపాదం*  *మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి* *మోర్తాడ్, భీంగల్, ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్ల నూతన భవనాలకు ప్రారంభోత్సవాలు*

నిజామాబాద్, సెప్టెంబర్ 30 :(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్ లలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను జిల్లా ఇంచార్జి మంత్రి అయిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎక్సైజ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి జూపల్లికి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గడిచిన ఐదేళ్ల వ్యవధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమందికి శిక్షలు ఖరారయ్యాయి, స్థానికంగా గంజాయి సాగు జరుగుతోందా, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాల గురించి ఎక్సైజ్ అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో గంజాయి, ఆల్ఫ్రాజోలం, గుడుంబా వంటి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల ఆనవాళ్లు లేకుండా ఉక్కుపాదం మోపాలని మంత్రి ఆదేశించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ మద్యం, గంజాయి రవాణా, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటి తనిఖీ కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాలను పంపిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఎక్కడైన గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు పట్టుబడితే, సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

అక్రమ మద్యం, గంజాయి నియంత్రణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రజలు మద్యానికి బానిసై వేలాది కుటుంబాలు ఆగమైనాయని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అనధికార మద్యం షాపులను ప్రోత్సహించారని, వేలాదిగా బెల్టు షాపులు వెలిశాయని ఆక్షేపించారు.

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తమ ప్రభుత్వం అక్రమ మద్యం, గంజాయి, కల్తీ కల్లు నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. బాల్కొండ నియోజకవర్గంలో పకడ్బందీగా అక్రమ మద్యం, గంజాయి రవాణాను అరికట్టారని ఎక్సైజ్ అధికారుల పనితీరును మంత్రి అభినందించారు.

మంత్రి వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button