*హిట్ అండ్ రన్ కేసులలో పరిహారం మంజూరు కోసం సత్వర విచారణ* *మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*
నిజామాబాద్, అక్టోబర్ 10 :(నిఘానేత్రం ప్రతినిధి) గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన (హిట్ అండ్ రన్) కేసులలో బాధితులకు, వారి కుటుంబీకులకు చట్ట ప్రకారం నష్ట పరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన విచారణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయా డివిజన్ల ఆర్డీఓలను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో గురువారం హిట్ అండ్ రన్ కేసుల జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 32 హిట్ అండ్ రన్ కేసులు నమోదవగా, వాటిలో 27 ప్రమాద ఘటనలకు సంబంధించి బాధిత కుటుంబాలు గుర్తించబడినాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీటిలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 17, ఆర్మూర్ డివిజన్లో 7, బోధన్ డివిజన్లో 3 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, హిట్ అండ్ రన్ కేసులలో మృతి చెందినట్లైతే చట్ట ప్రకారం సాధారణ బీమా కౌన్సిల్ ద్వారా బాధిత కుటుంబీకులకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడితే బాధితులకు రూ. 50 వేలు నష్ట పరిహారం అందించాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బాధితులకు పరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన సమగ్ర విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని ఆర్డీఓలకు సూచించారు. విచారణ నివేదిక రూపకల్పనకు అవసరమైన వివరాలను ఆర్డీఓలకు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాప్యానికి తావులేకుండా బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, అదే సమయంలో అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, కలెక్టరేట్ కార్యాలయ పర్యవేక్షకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.