*ప్రపంచ స్థాయి మానవ వనరుల తయారీ లక్ష్యంగా చర్యలు..రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు* *అత్యాధునిక వసతులతో సుమారు 25 ఎకరాలలో స్కూల్ నిర్మాణం* *కుల,మత వర్గాంతరాలు లేని విద్యాలయం* *క్రీడలను ప్రోత్సహించేలా విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పన* *వచ్చే విద్యా సంవత్సరం నాటికి నిర్మాణాలు పూర్తి* *మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి*
ఖమ్మం/బోనకల్, అక్టోబర్ -11:(నిఘానేత్రం ప్రతినిధి)మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాం రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ లతో కలిసి మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో సుమారు 25 ఎకరాల స్థలంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, లక్ష్మీపురం గ్రామం నుంచి తెలుగు ప్రజలందరికీ విజయదశమి దసరాపండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి నుంచి ప్రారంభించే మంచి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని, నేడు ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల జీవితాలను సమూలంగా మార్చగలిగే విద్యా వ్యవస్థకు అధికంగా నిధులు కేటాయించాలని, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థులను తయారు చేసుకునేందుకు అవసరమైన సిలబస్, మౌళిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని , భవిష్యత్తులో ప్రపంచానికి మానవ వనరులను అందించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లను ప్రారంభించామని అన్నారు.
సమాజాన్ని ఎస్సి, ఎస్టీ, బీసీ మైనారిటీ వంటి కులాలకు మతాల పేరుతో విడదీయకుండా ఉమ్మడి కుటుంబంలా అందర్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సమీకృత విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందించే కార్యక్రమానికి నాంది పలికామని అన్నారు.
సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలు ఆలోచన వచ్చినప్పుడు, ఇది సాధ్యమేనా అని నవ్వుల పాలు అంశంగా ప్రతిపక్షాలు భావించాయని, తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని బడ్జెట్లోనే స్పష్టంగా చెప్పిందని అన్నారు. విద్యలో సమూలమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తామని అన్నారు.
గత ప్రభుత్వాలు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ రెసిడెన్షియల్ పాఠశాలలకు గత సంవత్సరం కేటాయించింది కేవలం 73 కోట్లు మాత్రమేనని, ప్రజా ప్రభుత్వం 5 వేల కోట్లు కేటాయించినప్పుడు ఇది అవుతుందా అని ఎగతాళి చేశారని, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే చేసే పని మంచిదైతే సాధ్యం కానిది ఏది లేదని, 5 వేల కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలకు ఖర్చు చేయబోతున్నామని అన్నారు.
శుక్రవారం ముఖ్యమంత్రి నేడు దసరా సందర్భంగా ఒకే రోజు 28 పాఠశాలలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించు కున్నామని, అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాలు గుర్తించిన పాఠశాలలకు మొదటి విడతగా మంజూరు చేశామని అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మధిర నియోజకవర్గంలోని లక్ష్మీ పురంలో తాను, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ తమ తమ నియోజక వర్గాలలో నేడు శంకుస్థాపన చేస్తున్నారని అన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ పాఠశాలలు పూర్తి చేసి పిల్లలు వీటిలో చదువుకునేలా ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ఈ పాఠశాలలు ఎలా ఉండాలి అనే అంశంపై ముఖ్యమంత్రి, తాను మూడు నెలలుగా కసరత్తు చేస్తున్నామని, ఏ స్థాయిలో ఉండాలి, ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, విద్యార్థులకు ఏం నేర్పాలి, విద్యతో పాటు క్రీడలలో నైపుణ్యం కల్పించడం మొదలగు అంశాలు విపులంగా చర్చించామని అన్నారు.
విద్యార్థులకు అవసరమైన సకల సదుపాయాలు ఈ ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలకు పొందుపరిచిన తర్వాతనే భూమి పూజ చేస్తున్నామని అన్నారు.లక్ష్మీపురంలో స్థానిక పరిస్థితులు, స్థలం వివరాలు, గాలిలో తేమ, గాలి ప్రవాహం వంటి అనేక అంశాలను స్టడీ చేసి సాంకేతికంగా డిజైన్ తయారు చేసామని తెలిపారు.
విద్య అంటే కేవలం పాఠాలు చెప్పడం, పాఠ్యాంశాలు తెలుసుకోవడం మాత్రమే కాదని, విద్య మనల్ని సమగ్రంగా మార్చే అద్భుతమైన ఆయుధమని అన్నారు. ప్రపంచ విద్యావేత్తలు చెప్పిన విధంగా విద్య అంతిమ లక్ష్యం విముక్తి అని, ప్రపంచంలోనే అనేక అణగారిన పరిస్థితులకు పరిష్కారం, సమాంతరాలను తగ్గించేందుకు విద్య ద్వారా మాత్రమే సాధించ వచ్చని అన్నారు.
ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల్లో అన్ని వర్గాల వారికి అడ్మిషన్స్ ఇస్తామని, అందరికీ కామన్ క్రీడా ప్రాంగణాలు, ల్యాబ్, డైనింగ్ హాల్స్, వినోదం కోసం పనికి వచ్చే ఓపెన్ థియేటర్, క్రీడల కోసం క్రికెట్, ఫుట్ బాల్ స్టేడియం వంటి సౌకర్యాలు ఉంటాయని అన్నారు. భవిష్యత్తులో ఇది కోల్పోయా మనే భావం చిన్న పిల్లల మనసులో పోకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో కరెంట్, కిటీకి, ఫర్నీచర్ తలుపులు వంటి కనీస అవసరాలు తీర్చలేదని, 1100 కోట్లు కేటాయించి, గ్రామాల్లో డ్వాక్రా మహిళా సంఘాలచే ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా వాటిని బాగు చేశామని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరాను ప్రారంభించామని అన్నారు.
విద్యా శాఖపై సంపూర్ణంగా రివ్యూ చేసి 21,419 ఉపాధ్యాయులకు ఒకేసారి పదోన్నతులు కల్పించామని, దీని ద్వారా వారిలో విశ్వాసం పెంచామని, 34 వేల పైగా టీచర్లను పారదర్శకంగా బదిలీ చేశామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కారం చేస్తూ ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణం తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు మూసివేస్తారని అనుమానం ఉందని, పక్కా భవనాలు ఉన్న ఏ రెసిడెన్షియల్ స్కూల్ మూసి వేయడం జరగదని, కొత్తగా నిర్మించే పాఠశాలలకు భవన నిర్మాణం చేసి స్టాఫ్ కేటాయిస్తామని అన్నారు. కళ్యాణ మండపం, చిన్న, చిన్న షెడ్లలో ఉన్న పాఠశాల విద్యార్థులను ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల్లో భాగస్వామ్యం చేస్తామని అన్నారు.
లక్ష్మీపురం చుట్టు పక్కల గ్రామాలు సమాజంలోని రుగ్మతులపై పోరాటం చేశారని, స్వాతంత్ర్య పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం పెద్ద ఎత్తున జరిగిందని అన్నారు. ప్రాణాలు సైతం త్యాగం చేసి ప్రజల కోసం పోరాడిన మహనీయులు పుట్టిన గ్రామాలుగా వీటిని గుర్తు చేసుకుంటున్నామని అన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలు వృధా పోవద్దని, ఆ మహనీయులు నవ సమాజ నిర్మాణం కోసం పని చేశారని అన్నారు.
సంపద సృష్టించి పేదల అభ్యున్నతికి ఖర్చు చేస్తామని, ప్రతి ఒక్కరూ ఎదగాలని, అన్ని వర్గాల ప్రజలు ఎదిగేందుకు కావలసిన నిర్ణయాలు తీసుకుంటామని, వీటిని అడ్డుకునేందుకు కొంతమంది విష ప్రయత్నం చేస్తున్నారని, వాటికి అడ్డుకట్ట వేసి ముందుకు పోదామని, అడ్డంకులకు భయపడి అభివృద్ధి ఆపుతామని ఎవరైనా అనుకుంటే పొరపాటు అని అన్నారు.
నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, తాను 7 కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని, తాను పడిన ఇబ్బందులు ఎవరు పడవద్దనే సంకల్పంతో, ప్రతి తల్లి కోరికలను దృష్టిలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల రూపకల్పన చేశామని ఉపముఖ్యమంత్రి అన్నారు.
ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలను పరిశీలించేందుకు అనేక మంది వస్తారని, వారి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పాతర్లపాడు నుంచి గోవిందాపురం 6 కి.మి. రోడ్డు 20 కోట్లతో, రేపల్లెవాడ నుంచి లక్ష్మీపురం 6.8 కోట్లతో, లక్ష్మీపురం నుంచి పాతర్లపాడు రోడ్డు మంజూరు చేశామని అన్నారు. మాకు భేషజాలు, శషభిషలు లేవని, ప్రజలకు మంచి జరిగే ఏ విషయం పైనైనా సలహాలు అందిస్తే తప్పనిసరిగా పాటిస్తామని అన్నారు. మన రాష్ట్రం ప్రగతి శీలగా ఉండాలని కోరుకునే మేధావులు, విద్యా వంతులు ఈ పాఠశాలలను మెరుగ్గా నిర్వహించేందుకు సలహాలు సూచనలు అందించాలని ఉపముఖ్యమంత్రి కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి* మాట్లాడుతూ, రెండు నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి రివ్యూ సమావేశం నిర్వహించి ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని విద్యార్థులలో ఎలా పెంచాలని చర్చించారని, ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల రూపకల్పనలో డిప్యూటీ ముఖ్యమంత్రి పాత్ర కీలకమైందని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల వంటి సౌకర్యం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది చాలా ప్రత్యేకమైందని, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునేందుకు అవసరమైన వస్తువులతో ప్రభుత్వం దీన్ని నిర్మిస్తుందని అన్నారు. విద్యార్థులు చాలా మంది హైదరాబాద్ కు చదువు కునేందుకు వస్తారని, ఇటువంటి పాఠశాలలు నిర్మించడం ద్వారా ఆ అవసరం రాదని అన్నారు. మనం నిర్మించే పాఠశాలలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతం కావాలని ఎంపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ* మనం ఏ కులం, ఏ వర్గం వారైనా మన పిల్లలకు మంచి విద్యను అందించాలని కోరుకుంటామని, అదే ఆలోచనతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల వారికి రెసిడెన్షియల్ సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు అద్భుతమైన మౌళిక వసతులతో సౌకర్యవంతమైన భవనాలు నిర్మిస్తుందని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల ద్వారా 3 వేలకు పైగా విద్యార్థులు ఒకే చోట విద్య అభ్యసిస్తారని తెలిపారు. విద్యతో పాటు ప్రపంచ క్రీడా సదుపాయాలు, సాంస్కృతిక కళల పెంపుదలకు అవకాశం ఉంటుందని అన్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరు పిల్లలు ఎదగాలని ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న *వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ*, లక్ష్మిపురంలో నేడు పండుగ వాతావరణం ఉందని, అన్ని వర్గాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలని ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలను డిప్యూటీ సీఎం రూపకల్పన చేశారని అన్నారు. ప్రైవేటుకు ధీటుగా విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలు రూపొందించామని, ఇక్కడ చదువుకునే విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించాలనే ఉద్దేశ్యంతో వసతుల కల్పన జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యం, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, డిఇఓ సోమశేఖరశర్మ, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.