*విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట.. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి* *పిల్లలు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలి.. మంత్రి* *తిరుమలాయపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా బాలికలకు సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి*
ఖమ్మం, అక్టోబర్ 29(నిఘానేత్రం ప్రతినిధి)రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్య, వైద్యంలో మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి కి చర్యలు చేపడుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి, తిరుమలాయపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతి బాలికలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కష్టపడితే ఫలితం ఉంటుందని, కష్టం ద్వారా వచ్చిన ఫలితమే నిలబడుతుందని, ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, బాధలు పడి, పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారని, పిల్లలు, తమ తల్లిదండ్రులు వారేదైతే కావాలని కోరుతారో, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని అన్నారు.
ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారాలని, ప్రభుత్వం 637 కోట్లు ఖర్చు చేసి, పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన చేసినట్లు తెలిపారు. ప్రయివేటు లో చదివితే మంచి డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారని అనుకోవద్దని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి తెలిపారు. విద్య లేనిది మనుగడ లేదని భావించిన ప్రభుత్వం, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండకూడదని, 10 వేల మందిని ఉపాధ్యాయులుగా నియామకం చేసిందన్నారు.
ప్రతి విద్యార్థితో ప్రతిభ దాగి ఉంటుందని, విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీయుటకు స్కిల్ యూనివర్సిటీ ల ఏర్పాటు చేస్తుందన్నారు. ఫోర్త్ సిటీలో ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం చేసుకున్నట్లు, ఇందుకై బ్రహ్మాండమైన భవన నిర్మాణం చేసుకొనున్నట్లు తెలిపారు. మహేంద్రా ని చైర్మన్ గా నియమించుకొని, మధిర, హుజురాబాద్, ఆదిలాబాద్ లలో బ్రాంచులు ఏర్పాటు చేసుకుంటున్నట్లు, రాబోయే రోజుల్లో పాలేరు లో బ్రాంచి ఏర్పాటు అవుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా, మీరే పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి రావాలన్నారు.
నియోజకవర్గం లోని 4 మండలాల్లో హైస్కూలు కు 2 లక్షల చొప్పున 8 లక్షలు సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు మంత్రి మంజూరు చేశారు. కొద్ది రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ లు ఏర్పాటుచేస్తామని మంత్రి అన్నారు. నియోజకవర్గంలో 8, 9, 10, ఇంటర్ చదివే బాలికలకు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత సైకిళ్లను అందజేస్తున్నట్లు ఆయన అన్నారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ అని, ఈ సంవత్సరం 4వ తరగతి చదివే బాలిక 8వ తరగతికి రాగానే సైకిల్ అందజేస్తామని ఆయన అన్నారు. భవిష్యత్తులో బాలురకు ఏం చేయాలో ఆలోచించనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నమోదులు పెంచే బాధ్యత టీచింగ్, నాన్ టీచింగ్ అధికారులు, సిబ్బందిదని, ప్రతి హైస్కూల్ లో 200 మందికి మించి విద్యార్థుల నమోదు తప్పనిసరి ఉండాలని, ఆ దిశగా ఇప్పటినుండే ప్రణాళికాబద్ద కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మంచి ఫ్యాకల్టీ, మెరుగైన బోధనతో సేవలందించి, విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖరశర్మ, ఉన్నత పాఠశాల హెచ్ఎం విజయకుమారి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.