*పాడి పరిశ్రమకు ప్రభుత్వం ఇతోధిక తోడ్పాటు* *రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్ అమిత్ రెడ్డి* *ఎమ్మెల్యే, కలెక్టర్లతో కలిసి సారంగాపూర్ విజయ డెయిరీ సందర్శన* *విజయ పాలనే వినియోగించాలని విజ్ఞప్తి*
నిజామాబాద్, అక్టోబర్ 30: (నిఘానేత్రం ప్రతినిధి) పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రూ. 50 కోట్ల నిధులను విడుదల చేశారని, వీటికి అదనంగా మరో రూ. 10 కోట్లను జతచేసి పాడి రైతుల పాత బకాయిలను చెల్లించడం జరిగిందని తెలిపారు. బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి చైర్మన్ అమిత్ రెడ్డి బుధవారం సారంగాపూర్ లోని విజయ పాల డెయిరీ కేంద్రాన్ని సందర్శించారు. పాల సేకరణ, విక్రయాల తీరు గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాల శీతలీకరణ ప్రక్రియను పరిశీలించి, పాడి రైతులతో భేటీ అయ్యి వారి సమస్యలను ఆలకించారు. ఈ సందర్భంగా సమాఖ్య చైర్మన్ అమిత్ రెడ్డి మాట్లాడుతూ, ఆశించిన స్థాయిలో పాల విక్రయం జరగని కారణంగా విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న రైతులకు బిల్లుల చెల్లింపులలో కొంత జాప్యం జరుగుతోందని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పాడి పరిశ్రమకు బాసటగా నిలిచి పాడి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఇందులో భాగంగానే జైళ్లు, ఆలయాలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు తదితర వాటిలో విజయ డెయిరీ పాలనే వినియోగించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాల విక్రయాలలో గణనీయంగా వృద్ధి ఏర్పడిందని అన్నారు. అయినప్పటికీ ఇంకనూ విజయ డెయిరీ పాల విక్రయాలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే సంస్థ నష్టాలను అధిగమించి పాడి రైతులకు లాభాలు పంచగలుగుతుందని తెలిపారు. ఏమాత్రం కల్తీకి ఆస్కారం లేకుండా స్వచ్ఛతకు మారుపేరు అయిన విజయ డెయిరీ పాలనే అన్ని వర్గాల ప్రజలు విరివిగా వినియోగించేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, ఈ దిశగా రైతు సంఘాల ప్రతినిధులు సైతం కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి రోజు విజయ డెయిరీ యూనిట్ల ద్వారా 4.40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా, 3.20 లక్షల లీటర్ల పాల మాత్రమే అమ్మకం అవుతున్నాయని తెలిపారు. మిగులు పాలను మిల్క్ పౌడర్ గా, వెన్నగా మార్చేందుకు చిత్తూరు జిల్లాకు పంపించాల్సి వస్తుండడం వల్ల సంస్థపై ఆర్ధిక భారం పడుతోందన్నారు. దీనికితోడు దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణాలో పాడి రైతులకు అత్యధిక ధర చెల్లించడం జరుగుతోందన్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్రలో లీటరు పాలకు అక్కడి ప్రభుత్వం కేవలం రూ. 23 మాత్రమే ధర చెల్లిస్తోందని, తెలంగాణలో పాడి రైతులకు దాదాపు రెట్టింపు స్థాయిలో రూ. 39 ధర అందిస్తున్నామని చైర్మన్ అమిత్ రెడ్డి వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పాడి రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, వారికి లాభాలు అందించాలనే దిశగా సమాఖ్య కృషి చేస్తోందని, ప్రభుత్వ తోడ్పాటుతో త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమకు నష్టాలను నివారిస్తూ, లాభాల బాటలో పయనింపజేసేందుకు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో రైతు సంఘాలు కూడా ఆలోచనలు చేయాలని సూచించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలో వినియోగం అవుతున్న పాలలో కేవలం పది శాతం మాత్రమే విజయ డెయిరీ పాలను వినియోగిస్తున్నారని అన్నారు. పాడి రైతులు తోడ్పాటును అందిస్తే ఈ సంస్థ నష్టాలను అధిగమించి, లాభాలు పంచగలుగుతుందని సూచించారు. ముల్కనూరులో రైతులు సమాఖ్యగా ఏర్పడి సమిష్టి కృషితో సత్ఫలితాలు సాధించారని, అదే స్పూర్తితో జిల్లాలోని పాడి రైతులు కూడా కృషి చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా విజయ డెయిరీ పాలు స్వచ్ఛతకు మారుపేరు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని , తద్వారా విక్రయాలు గణనీయంగా పెరిగేలా చొరవ చూపాలన్నారు. విజయ డెయిరీ సంస్థ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు. కాగా, పాల వినియోగం జరిగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విజయ డెయిరీ పాలనే వినియోగించాలని శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి సూచించారు. విజయ డెయిరీ సంస్థ ఇబ్బందులను అధిగమించేలా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. స్వేచ్చా విఫణిలో వికృయించే పాలలో కల్తీ జరుగుతున్న ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయని, పిల్లల అనారోగ్యాలకు కల్తీ కారణమవుతోందని ఆందోళన వెలిబుచ్చారు. కల్తీకి అవకాశం లేకుండా శుద్ధమైన విజయ పాలను పాలను ప్రజలు వినియోగిస్తూ పాడి రైతుల అభ్యున్నతికి దోహదపడాలని పిలుపునిచ్చారు . వీరి వెంట రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సారంగాపూర్ విజయ డెయిరీ యూనిట్ ఉప సంచాలకులు నాగేశ్వర్ రావు, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథచారి, పాడి రైతుల సంఘం ప్రతినిధులు సురేష్, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.