*రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా అయ్యేవిధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు*
* హైదరాబాద్, నవంబర్ 15:(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా అయ్యేవిధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షించారు. నవంబర్ 6 వతేదీన ప్రారంభమైన ఈ సర్వేను జాప్యం లేకుండా నిర్దేశించిన కాలపరమితిలో పూర్తి చేయడానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్వహించిన నివాసాల లిస్టింగ్ లో మొత్తం 1,16,14,349 ఇళ్లకు మార్కింగ్ చేయడమైనదని, ఈ ఇళ్లల్లో ఏ ఒక్క ఇల్లును కూడా వదలకుండా ప్రతీ ఇంటిలో సమగ్రంగా సర్వేను నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సర్వే రాష్ట్ర పౌరుల అభ్యున్నతికే సేకరించడం జరుగుతుందని, ఈ సర్వేను రాష్ట్ర గవర్నర్ వివరాలతో ప్రారంభించిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ సర్వేలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని సర్వేకు కావలసిన వివరాలను కూడా ఉత్సాహంగా అందచేస్తున్నారని సమాచారం అందుతోందని వెల్లడించారు. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేవిధంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
శుక్రవారం (15 వ తేదీ)వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44.1 శాతం అంటే 51,24 ,542 ఇళ్లలో సర్వే పూర్తయిందని, ఈ సర్వేలో 87, 807 మంది సిబ్బంది, 8788 పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారని, ప్రజల నుండి స్పందన బాగా ఉందని అధికారులు సిఎంకు వివరించారు. 52, 493 గ్రామీణ, 40 ,901 అర్బన్ బ్లాకులుగా మొత్తం 92,901 బ్లాకులుగా విభజించి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతోందని అన్నారు. ఈ సర్వే ప్రక్రియను పర్యవేక్షించాడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులను ఉమ్మడి జిల్లాల వారీగా నియమించామని, క్షేత్ర స్థాయిలో ఈ సీనియర్ అధికారులు కూడా పర్యటిస్తున్నారని అన్నారు. రాష్టంలో సర్వే జరుగుతున్న తీరు పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణిత సమయం లో సర్వే పూర్తిచేసేలా పర్యవేక్షణ అధికారులు చర్యలు తీసుకోవాలని సి.ఎం సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మరియు ఉన్నత అధికారులు, తదితరులు హాజరయ్యారు