Politics

*ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్*

నిజామాబాద్, నవంబర్ 16 :(నిఘానేత్రం ప్రతినిధి)మాక్లూర్ మండలం మాణిక్ భండార్ లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించి, ఇప్పటివరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, రైస్ మిల్లులకు ఎంత ధాన్యం తరలించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్ల వద్ద ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. ఎక్కడ కూడా తరుగు, కడ్తా పేరిట కోతలు విధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బ్యాగుల కొరత నెలకొనకుండా చూడాలని, నిర్దేశిత మిల్లులకు వెంటదివెంట ధాన్యం తరలింపు కోసం లారీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో టాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులను కలిసి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సన్నాలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2320 తో పాటు బోనస్ రూపేణా ప్రభుత్వం రూ.500 చొప్పున చెల్లించనుంది తెలిపారు. మద్దతు ధర బ్యాంకు ఖాతాలలో జమ అయిన వారం పది రోజుల అనంతరం బోనస్ డబ్బులు కూడా జమ అవుతాయని కలెక్టర్ రైతులకు సూచించారు. యాసంగి సీజన్లో అందుబాటులో ఉండే సాగు నీటి వసతికి అనుగుణంగా అధిక దిగుబడిని అందించే పంటలను, మేలు రకానికి చెందిన వంగడాలను విత్తుకోవాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని, అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట మెప్మా పీ.డీ రాజేందర్, కేంద్రం నిర్వాహకులు, సంబంధిత అధికారులు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button