
*ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖది కీలక పాత్ర* *ప్రత్యేక కమిషనర్ సి హెచ్ ప్రియాంక*
హైదరాబాద్, జూన్ 30:(నిఘానేత్రం ప్రతినిధి)ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందని I &PR ప్రత్యేక కమిషనర్ సి హెచ్ ప్రియాంక అన్నారు. సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో పౌర సంబంధాల అధికారి గా విధులు నిర్వర్తిస్తున్న ముళ్ళపూడి శ్రీనివాస్ కుమార్ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో PRO శ్రీనివాస్ కుమార్ ను కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక కమిషనర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచి ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేందుకు సమాచార శాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
సమాచార శాఖ కార్యాలయంలో PRO ముళ్ళపూడి శ్రీనివాస్ కుమార్ తమ విధులను అంకితభావంతో సమర్థవంతంగా నిర్వర్తించారని I &PR ప్రత్యేక కమిషనర్ సి హెచ్ ప్రియాంక ప్రశంసించారు. ఉద్యోగ విరమణ మరొక కొత్త జీవితం అని అన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వ్యక్తి గత జీవితాన్ని చాలా కోల్పోతామని, ఉద్యోగం విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలన్నారు. అనంతరం శ్రీనివాస్ కుమార్ కుటుంబ సభ్యులను ప్రత్యేక కమిషనర్ పరిచయం చేసుకున్నారు.
సమాచారశాఖ PRO ముళ్ళపూడి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ తన 38 ఏండ్ల ఉద్యోగ జీవితం సంతృప్తిగా సాగిందన్నారు. అనేక పురస్కారాలు లభించాయన్నారు. చిత్తశుద్ధితో పని చేయడం వలన సమాచార శాఖ కు తాను చేసిన సేవల కంటే పొందినదే ఎక్కువ అని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జీ అదనపు సంచాలకులు డి.ఎస్.జగన్, సంయుక్త సంచాలకులు కె.వెంకట రమణ, వెంకటేశ్వరావు, ఉప సంచాలకులు మధుసూధన్, వై వెంకటేశ్వర్లు, ప్రసాద్, హష్మీ , సమాచార శాఖ అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు.