నూడా చైర్మన్ గా కేశ వేణు నియామకం
నిజామాబాద్, సెప్టెంబర్ 09(నిఘానేత్రం ప్రతినిధి )
నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (నూడా )చైర్మన్ గా కేశ వేణు నియమాకం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్న ఆయనను నుడా చైర్మన్ గా నియమించేందుకు పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్ నాయకులకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులతోపాటు ఇతర నామినేటెడ్ పోస్టులను అప్పగిస్తోంది. ఈ క్రమంలో కేశ వేణుకు నుడా బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది . కేశ వేణు దశాబ్దకాలానికిపైగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. యూత్ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పని చేసిన కేశ వేణు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా పనిచేసి నగరంలోని అన్ని వర్గాల వారితో సఖ్యతగా ఉంటూ సత్సంబంధాలు పెంచుకున్నారు.జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించి పార్టీ అధినాయకత్వం దృష్టిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేశ వేణుకు నూడా చైర్మన్ పదవి రానున్నడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ నిజమైన కార్యకర్తకు పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.